గచ్చిబౌలి జయభేరి అపార్ట్‌మెంట్‌లో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన దంపతులతో పాటు వారి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. గోపన్నపల్లిలోని జయభేరి అపార్ట్‌మెంట్‌లో ఈ ఘోర ఘటన వెలుగుచూసింది.
మృతుల ప్లాట్ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు తలుపులు తెరిచి చూడగా ముగ్గురూ నిర్జీవంగా కనిపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, పూర్తి వివరాల కోసం దర్యాప్తును వేగవంతం చేశారు.