మైనింగ్ టెండర్లతో దళితుల భూములకు రక్షణ కరువు! 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో మైనింగ్‌కు అనుమతులు.. నిలిపివేయాలని కలెక్టర్‌కు వినతి
రామాయంపేట : మైనింగ్ టెండర్ల పేరుతో దళితుల సాగు భూములకు ముప్పు వాటిల్లుతోందని, మూడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రామాయంపేట మండలంలోని సర్వే నంబర్ 1421లో ఉన్న దళితుల భూముల్లో మైనింగ్‌కు ఇచ్చిన అనుమతులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ శనివారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సదరు భూములను దళితులు గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ పంటలు పండిస్తున్నారని తెలిపారు. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వ పట్టాలు, ధ్రువపత్రాలు, వన్‌బీ రికార్డులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ఫేజ్-1, ఫేజ్-2 పేరుతో టెండర్లు నిర్వహించి మైనింగ్‌కు అనుమతులు మంజూరు చేయడం ఆందోళనకరమని అన్నారు.
అదేవిధంగా మైనింగ్ జరగనున్న ప్రాంతానికి సమీపంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పాఠశాలకు కేవలం 200 మీటర్ల దూరంలోనే మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం వల్ల విద్యార్థుల భద్రతతో పాటు పరిసర ప్రాంతాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమైతే తరతరాలుగా భూములపై ఆధారపడి జీవిస్తున్న దళిత కుటుంబాలు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కావున సంబంధిత మైనింగ్ అనుమతులను పునఃపరిశీలించి, దళితుల సాగు భూములకు నష్టం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌ను వినతిపత్రం ద్వారా కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు, మాలల హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మల మైసయ్య, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, తూప్రాన్ నర్సింలు, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.