telangana
మానేరు వాగుపై హై లెవల్ వంతెన పనులు పునఃప్రారంభం
సూర్య జమ్మికుంట : ఓదెల మండలం రూపునారాయణపేట, జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామాల మధ్య మానేరు వాగుపై 80 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న హై లెవల్ వంతెన పనులు బుధవారం పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పనులను తిరిగి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వంతెన నిర్మాణం కోసం 80 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని తెలిపారు. గతంలో పనులు ప్రారంభమైనా సంబంధిత కాంట్రాక్టర్ లోపం వల్ల పనులు పూర్తి కాలేదన్నారు. దీంతో పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగించి తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు.ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల నుంచి జమ్మికుంట, హుజురాబాద్, వరంగల్ వెళ్లే ప్రజలకు ఈ వంతెన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి జమ్మికుంటకు, జమ్మికుంట నుంచి పెద్దపల్లికి వచ్చే ప్రజలకు ప్రయాణ దూరం, సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి, మంత్రివర్గం సహకారంతో పెద్దపల్లి నియోజకవర్గానికి అనేక నిధులు మంజూరు చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. వంతెన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్ణీత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశించారు.కార్యక్రమంలో విలాసాగర్ సర్పంచ్ గరిగంటి శ్రీకాంత్, ఉప సర్పంచ్ ఆరెల్లి దివ్య, కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.