మాగనూర్ నూతన ఎస్సైగా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
మాగనూర్ సూర్య న్యూస్ :
మాగనూర్ మండల నూతన ఎస్సైగా మహేందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఇతను ఇంతకుముందు జోగులాంబ గద్వాల జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై గా విధులు నిర్వహించి బదిలీపై మాగనూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై గా నియమితులయ్యారు.
ఇంతకు ముందు మాగనూర్ ఎస్ఐ గా విధులు నిర్వర్తించిన ఎస్సై అశోక్ బాబు బదిలీపై గద్వాల జిల్లాకు వెళ్లారు.
ఈ సందర్భంగా నూతన ఎస్సై జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ని ఎస్పీ కార్యాలయంలో పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.ఎస్పీ నూతన ఎస్సై కి శుభాకాంక్షలు తెలిపి ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలు పరిరక్షించాలని తెలిపారు.
ఈ సందర్భంగా నూతన ఎస్‌ఐ కే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... మాగనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తామన్నారు.
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ఫిర్యాదులపై చట్ట ప్రకారం వేగంగా స్పందిస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
మండల పరిధిలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్‌ఐ కోరారు.
ఆంజనేయులు, సూర్య రిపోర్టర్ మాగనూర్ మండలం