మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. క్రీడలకు దగ్గరవ్వాలి
సూర్య - గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యువశక్తి పెద్దపల్లి సహకారంతో గోదావరిఖనిలోని సెక్రెడ్ హార్ట్ హైస్కూల్‌లో విద్యార్థులకు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఏసీపీ రమేష్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. మాజీ సైనికులు లెంకల మహిపాల్ రెడ్డి, పల్లె శ్యామ్ సుందర్ రెడ్డి భారత సైన్యంలో చేరేందుకు ఉన్న అవకాశాలు, అర్హతలు, ఎంపిక విధానాన్ని వివరించారు. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. అనంతరం క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో యువశక్తి మీడియా ప్రతినిధి శీలం అనిల్ పాల్గొన్నారు.