ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సూర్య, కాగజ్నగర్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, భద్రతా సిబ్బంది న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ కొమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కాగజ్నగర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. 10 నుంచి 20 ఏళ్లుగా సేవలందిస్తున్న కార్మికులకు నాలుగేళ్లుగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలని, చట్ట ప్రకారం వేతనాలు, సెలవులు, బోనస్, రెండు జతల యూనిఫాంలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించడంతో పాటు పూర్తి వేతనంపై ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే నవంబర్ 28 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తిరుమల, మీనాక్షి, ఇమ్రాన్ తదితర కార్మికులు పాల్గొన్నారు.