ఫిర్యాదు తీసుకోని పోలీసులు!
వ్యవసాయ వర్సిటీలో మహిళా లెక్చరర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించాలి: ఆప్ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్
(రంగారెడ్డి -మేజర్ న్యూస్): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మహిళా లెక్చరర్ తేజస్విపై లైంగిక వేధింపులు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ప్రయత్నించినప్పటికీ రాజేంద్రనగర్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మహిళా లెక్చరర్‌కే రక్షణ లేకపోతే అక్కడ చదువుకుంటున్న విద్యార్థినుల భద్రతకు దిక్కెవరని ప్రశ్నించారు. మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, బాధితురాలి ఫిర్యాదునే స్వీకరించకపోవడం విచారకరమన్నారు. వెంటనే ఫిర్యాదు స్వీకరించి, ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో హోంమంత్రి పదవిని భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో మహిళల భద్రతపై బాధ్యత వహించేవారెవరనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. మహిళలపై దాడులు, వేధింపుల ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం తక్షణమే స్పందించకపోవడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని సమగ్ర విచారణకు ఆదేశించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై మహిళా కమిషన్‌లోనూ విచారణ జరగనున్న నేపథ్యంలో బాధితురాలికి న్యాయం జరిగేలా కమిషన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా నిలుస్తుందని హేమా సుదర్శన్ స్పష్టం చేశారు.