'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' నిర్వహణకు కేబినెట్ నిర్ణయం:
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి :ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2,25,000 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ దీపావళి వేడుకల్లో పాల్గొంటారు. అలాగే నవంబర్ 19న మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా వర్తింపజేసే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి సంబంధించి నవంబర్ 20 నుంచి 30 వరకు గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తులను సేకరిస్తారు.
రాజ్యంగబద్ధ హక్కుల పరిరక్షణ మరియు ఫిర్యాదుల వేగవంతమైన పరిష్కారం కోసం ప్రస్తుతం ఉన్న ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి, వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకోసం 2003 నాటి చట్టాన్ని రద్దు చేయడానికి ఆమోదం తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్రతి కమిషన్‌లో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారు.
వీటితో పాటు, అగ్నిప్రమాదాల నివారణ మరియు తక్షణ చర్యల కోసం తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్-1999 సవరణ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఓకే చెప్పింది. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఫైర్ శాఖ చర్యలను ఇందులో చేర్చనున్నారు. అంతేకాకుండా తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం-1923 సెక్షన్ 12(ఏ) సవరణకు ఆమోదం తెలుపుతూ, సర్వే నోటీసులపై అప్పీల్ చేసుకునే కాలపరిమితిని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.