కేఎం.పాండు ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్ :కేఎం.పాండు ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత కేఎం.పాండు 8వ వర్ధంతి సందర్భంగా చింతల్లోని కేఎం.పాండు మార్గ్ వద్ద గురువారం నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన తనయుడు, బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేఎం.పాండు విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కేఎం.పాండు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్యాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుచూపుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. అక్షరాస్యత ద్వారానే పేద ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు సాధ్యమవుతుందని విశ్వసించిన కేఎం.పాండు విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. అనేక కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న కేఎం.పాండు ఎంతోమందికి రాజకీయ అవకాశాలు కల్పిస్తూ ప్రజాసేవకు మార్గదర్శకంగా నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన ప్రజాసేవా స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ పార్టీల నాయకులు, మహిళా నాయకురాళ్లు, అనుబంధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొని కేఎం.పాండు చిత్రపటానికి, విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.