లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెట్పల్లి సీడీపీవో
సూర్య మెట్పల్లి : సూర్య తెలంగాణ డెస్క్: జగిత్యాల జిల్లా మెట్పల్లి సీడీపీవో దరోజు పద్మను కరీంనగర్ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెట్పల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయకుండా అధికారికంగా అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమె ఈ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు రూ.3,000 లెక్కన మొత్తం రూ.63,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు సెప్టెంబర్ 26వ తేదీన ఫిర్యాదుదారుడి నుంచి కార్యాలయ ఆవరణ వెలుపల రూ.63,000 లంచం నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీడీపీవో దరోజు పద్మను అరెస్ట్ చేసి, కరీంనగర్‌లోని ఎస్‌పీఈ మరియు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఫిర్యాదుదారుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన వ్యక్తిగత వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ధైర్యంగా ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.