కోహెడ నాగ సముద్రాల మోడల్ స్కూల్‌ను ముక్కలు చేసే రోడ్డు అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలి
కోహెడ ; కోహెడ మండలం నాగ సముద్రాల గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణను రెండుగా విభజిస్తూ రహదారి అలైన్మెంట్ రూపొందించడం విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుకోవాల్సిన విద్యాలయ ప్రాంగణాన్ని రహదారి కోసం ముక్కలు చేయడం ఎంతవరకు సమంజసమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈరోజున బీజేపీ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్ మరియు వివిధ బాధ్యతల్లో ఉన్న బీజేపీ నాయకులతో కలిసి నాగ సముద్రాల మోడల్ స్కూల్‌ను సందర్శించి రహదారి అలైన్మెంట్ వల్ల పాఠశాలకు కలుగుతున్న నష్టాన్ని పరిశీలించారు. అనంతరం ఖమ్మం వేంకటేశం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ కోహెడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 700 నుంచి 800 మంది విద్యార్థులు ఈ మోడల్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నారని సర్వే నంబర్ 263.లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో కాంపౌండ్ వాల్‌తో సహా పాఠశాల నిర్మాణం జరిగిందని తెలిపారు. అయితే కొంతమంది వ్యక్తులకు చెందిన రెండో, మూడో బిట్ల భూములకు ప్రధాన రహదారి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో కేవలం మోడల్ స్కూల్ పరిధిలోనే రహదారి అలైన్‌మెంట్‌ను మార్చడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు ఈ అలైన్మెంట్ అమలైతే పాఠశాల ప్రాంగణం రెండుగా విడిపోవడమే కాకుండా పాఠశాలలోని సగభాగం రహదారిలో కలిసిపోయే ప్రమాదం ఉందని, చివరకు వాలీబాల్ కోర్టు వరకు రహదారి విస్తరించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థులకు ఆటస్థలం, విద్యా వాతావరణం, భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతుందని, భవిష్యత్తులో పాఠశాల మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒక విద్యాసంస్థకు సంబంధించిన రహదారి అలైన్‌మెంట్‌ను పదేపదే మార్చడం వెనుక ఉన్న కారణాలేమిటి? ఇప్పటివరకు మూడుసార్లు సర్వే నిర్వహించినప్పటికీ విద్యార్థులకు నష్టం కలిగించే విధంగానే అలైన్మెంట్ ఎందుకు రూపొందించారు? గత ఏడాది మోడల్ స్కూల్‌కు సంబంధం లేకుండా పాఠశాల ఖాతాలో సుమారు రూ.62 లక్షలు జమ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఈ అంశాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని ఖమ్మం వేంకటేశం డిమాండ్ చేశారు. మాడల్ స్కూల్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించాలి. కోహెడ మండలంలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నాగ సముద్రాల మోడల్ స్కూల్‌ను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని ఖమ్మం వేంకటేశం కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వివాదాస్పద రహదారి అలైన్‌మెంట్‌ను వెంటనే నిలిపివేసి, ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని, అలైన్మెంట్ రూపొందించిన అధికారుల బాధ్యతను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆస్తి పరిరక్షణకు అఖిలపక్షం ముందుకు రావాలి. విద్యార్థుల భవిష్యత్తు విద్యాసంస్థల పరిరక్షణ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని ఇది సమాజం మొత్తం బాధ్యత అని అన్నారు. అందువల్ల రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి మోడల్ స్కూల్ ఆస్తిని కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రోడ్డు అలైన్మెంట్ మార్చే వరకు విద్యార్థుల పక్షాన నిలబడి అవసరమైతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని కోరారు. అన్ని పార్టీలు కలిసి వస్తే అఖిలపక్షం ఆధ్వర్యంలో, లేనిపక్షంలో బీజేపీ నేతృత్వంలో విద్యార్థులతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని కొనసాగించి మోడల్ స్కూల్ ఆస్తిని కాపాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోహెడ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్ తో పాటుగా మాజీ సర్పంచ్ మ్యాకాల చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు సామల గిరిధర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కంది సత్యనారాయణ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు నాగు అజయ్, బీజేపీ నాయకులు చిగురు రాజిరెడ్డి, మారెల్లి కరుణాకర్, దానవేని రమేష్, ఎడమల రాజు రెడ్డి, వేముల రమేష్, గుంటి బాలయ్య, తాటిపాముల శంకరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.