సూర్య, మందమర్రి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాల సాధనకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని జీఎం (ఈ అండ్ ఎం/సీహెచ్‌పీ) కే. శ్రీనివాసులు సూచించారు. గురువారం మందమర్రి ఏరియాను సందర్శించిన ఆయన కేకే-1 కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ), రైల్వే సైడింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయానికి చేరుకున్న కే. శ్రీనివాసులుకు ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. అనంతరం ఏరియా అధికారులతో కలిసి కేకే-1 సీహెచ్‌పీని సందర్శించి అక్కడ జరుగుతున్న బొగ్గు నిర్వహణ పనులను పరిశీలించారు. ప్లాంట్‌లో యంత్రాల నిర్వహణ, సాంకేతిక అంశాలు, పనితీరు గురించి సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బొగ్గు నిర్వహణ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన సాంకేతిక మెరుగుదలలు చేపట్టాలని సూచించారు. అనంతరం రైల్వే సైడింగ్‌ను సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల నిర్వహణలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించుకోవాలని అధికారులకు సూచించారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంతో పాటు రవాణా ప్రక్రియ సజావుగా సాగేందుకు సీహెచ్‌పీ, రైల్వే సైడింగ్ కీలకమని, ఈ విభాగాల్లో సమర్థవంతమైన నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏరియా డీజీఎం (ఈ అండ్ ఎం) బాలాజీ భగవతి, కార్పొరేట్ డీజీఎం (ఈ అండ్ ఎం) ఎస్.కె. కరీముల్లా, కేకే ఓసీపీ ప్రాజెక్టు ఆఫీసర్ రాంబాబు, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, డీజీఎం (సివిల్) మదీనా భాష తదితరులు పాల్గొన్నారు.