*కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు*
సంగారెడ్డి;రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులకు సూచించారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.సంగారెడ్డి మండలంలోని కులాబ్‌గుర్, కొత్లాపూర్ గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఇప్పటికే అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, పంట కొనుగోళ్ల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులందరికీ సమాన ప్రాధాన్యత కల్పించాలని, దళారీ వ్యవస్థకు తావులేకుండా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరించాలని అధికారులకు సూచించారు. ప్రతి క్వింటాల్ సన్నధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్‌ను అర్హులైన రైతులందరికీ అందించాలని, గత ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలను సైతం తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, పంట రుణాల సమస్యలు, ఎరువుల కొరత వంటి అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరినట్లు వెల్లడించారు.కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం తేమ శాతం పరీక్షలు, తూకం ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా రవాణా ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులకు చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని పేర్కొన్న ఆయన.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు సకాలంలో అందినప్పుడే వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందని అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్ల ప్రక్రియను అధికారులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, ఆయా గ్రామాల సర్పంచులు, డీసీఎంఎస్ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.