జర్నలిస్టు కుటుంబానికి జర్నలిస్టుల ఆర్ధిక సహాయం
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఇటీవల గుండె పోటుతో మరణించిన గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యుడు,సీనియర్ జర్నలిస్టు వనం వెంకటరమణ కుటుంబానికి సొసైటీ తరపున రూ. 50 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. కొంతమంది సొసైటీ సభ్యుల ద్వారా వచ్చిన ఈ మొత్తం డబ్బులను సొసైటీ అధ్యక్షుడైన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య శనివారం అంబర్ పేటలోని వెంకటరమణ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టు వెంకటరమణ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం బాధాకరమని అన్నారు. వెంకటరమణ లాంటి ఎంతోమంది జర్నలిస్టులు జర్నలిజం వృత్తిని నమ్ముకొని పేదరికంతో జీవనం సాగిస్తున్నారని, చాలామంది జర్నలిస్టులు సరైన వేతనాలు, ఇతర ఆదాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం కనీసం ఉచిత వైద్య సదుపాయం కల్పించకపోవడం వల్ల ఎంతోమంది జర్నలిస్టులు చనిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు ఇవ్వాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ళస్థలాల కల నేటికీ నెరవేరలేదని, ఇంటి స్థలం పొందకుండానే చాలా మంది జరచనలిస్టులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలో పాత్రికేయులకు పింఛన్ సదుపాయం ఉందని, మన రాష్ట్రంలో ఈ సదుపాయం కల్పించడంలేదని అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్ధిక సహాయంగా ప్రభుత్వం కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇస్తుందని, ఈ సహాయాన్ని ఐదు లక్షలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న ఐదు అంశాలను గాలికి వదిలేసిందని, ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం పూర్తి వివక్ష చూపుతుందని, ఫలితంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం మీడియా యాజమాన్యాలు జర్నలిస్టులను కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని, ఇటువంటి తరుణంలో జర్నలిస్టులకు జర్నలిస్టులే అండగా నిలవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా నాయకులు వి. రవికుమార్, వర్కాల కిష్టయ్య, శ్రీధర్, వెంకటరమణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.