21 ఏళ్ల తర్వాత కలిసిన జగ్గారెడ్డి, హరీష్ రావు
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఆత్మీయ కలయిక చోటుచేసుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంటికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా కలుసుకోవడం విశేషం. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 2004లో హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయనను కలిసి, ఆయన ఛాంబర్‌లో కలిసి భోజనం చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హరీష్ రావును వ్యక్తిగతంగా కలవలేదన్నారు. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఓ కుటుంబ వేడుకలో కలుసుకున్నామని తెలిపారు. తన కుమార్తె వివాహానికి హరీష్ రావును ఆహ్వానించలేకపోయానని, అయితే ఈ కుటుంబ వేడుకను ఆయన మిస్ కావొద్దనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆహ్వానించానని చెప్పారు. తమ కలయికలో ఎలాంటి రాజకీయాలు, మతలబులు లేవని స్పష్టం చేశారు.
రాజకీయం రాజకీయమేనని, హరీష్ రావు బీఆర్ఎస్‌లో అగ్రనేతగా ఉన్నారని, తాను కాంగ్రెస్‌లో టాప్ లీడర్ కాకపోయినా ఒక స్థాయి నాయకుడినని వ్యాఖ్యానించారు. గతంలో అనేక కుటుంబ వేడుకలకు హరీష్ రావును ఆహ్వానించలేకపోయానని, పదేళ్ల పాటు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కలుసుకోలేదని జగ్గారెడ్డి వెల్లడించారు.
రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలు, ఆత్మీయతలకు రాజకీయాలతో సంబంధం లేదన్నట్లుగా ఈ ఇరువురు నేతల కలయిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఎ.రవీందర్, హైదరాబాద్.