పీహెచ్‌సీని తనిఖీ చేసిన ప్రజారోగ్య శాఖ డైరెక్టర్
సూర్య, మాక్లూర్ : మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ శనివారం సందర్శించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీతో కలిసి పీహెచ్‌సీని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఫార్మసీ, ల్యాబ్, వార్డు, ఓపీ సేవలు, రికార్డులను పరిశీలించి వైద్య సేవల నాణ్యత పెంపునకు పలు సూచనలు చేశారు. 12 గంటల పీహెచ్‌సీ కావడంతో విధి వేళల్లో ప్రసవ కేసులు వస్తే సాధారణ ప్రసవాలు నిర్వహించాలని, అత్యవసర వైద్య సేవలు ఆలస్యం చేయకుండా అందించాలని ఆదేశించారు.మాతా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, టీబీ ముక్త్ భారత్, కుష్ఠు వ్యాధి నివారణ, ఎన్‌సీడీ తదితర జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో ఎలాంటి పెండింగ్‌లు లేకుండా ప్రతిరోజూ పూర్తి చేయాలని, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని తెలిపారు.ముఖ్యంగా గర్భిణుల ఈడీడీ జాబితాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, హైరిస్క్ గర్భిణులను గుర్తించి తగిన వైద్య సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సికిందర్, బోధన్ డిప్యూటీ డీఎంహెచ్ఓ విద్య,డాక్టర్ అజ్మల్, డీఎస్‌ఓ డాక్టర్ వెంకటేష్, ఫార్మసీ సూపర్‌వైజర్ నారాయణ, డాక్టర్ రాజశ్రీ, హెచ్‌ఈఓ గోవర్ధన్, సీహెచ్‌ఓ గిరిధర్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేష్, సూపర్‌వైజర్ ప్రమీలారాణి, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.