telangana
పెళ్లి పేరుతో సైబర్ మోసం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి రూ.10 లక్షల టోకరా..
హైదరాబాద్ (మేజర్ న్యూస్ ప్రతినిధి): వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వద్ద నుంచి రూ.10 లక్షల మేర కాజేసిన సైబర్ మోసగాడి గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జాజుల గుణవంత్‌తో పాటు అతడి తల్లి పటూరి సురేఖను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని పెళ్లి పేరుతో పరిచయం చేసుకున్న నిందితుడు, నమ్మకం కుదిరాక వివిధ కారణాలు చెబుతూ దఫదఫాలుగా రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన నిందితుల వద్ద నుంచి పోలీసులు 20 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. ఈ మోసంలో భాగస్వామిగా ఉన్న మరో నిందితుడు బొరుగుంట లోకేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.