గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నౌకపై అమెరికా సైన్యం దాడి.. ఇరాన్ దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందంటూ చర్య!
సూర్య గ్లోబల్ & డిఫెన్స్ డెస్క్ (వాషింగ్టన్/టెహ్రాన్): మధ్యప్రాచ్య సముద్ర జలాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధిస్తున్న నౌకాదిగ్బంధనాన్ని (నేవల్ బ్లాకేడ్) ఉల్లంఘించేందుకు ప్రయత్నించిందన్న కారణంతో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం దాడి జరిపి నిలిపివేసింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి బయలుదేరిన పలావు జెండా కలిగిన 'ఎం/వి పసిఫిక్ ఆర్చర్' నౌకకు అమెరికా దళాలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశాయి. అయినప్పటికీ నౌక సిబ్బంది దిగ్బంధనాన్ని దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో, అమెరికా యుద్ధ విమానం కచ్చితమైన లక్ష్యంతో నౌక వెనుక భాగంలో దాడి జరిపింది. ఈ దాడిలో నౌక ప్రొపల్షన్ (ఇంజిన్) వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని నిలిచిపోయిందని, అయితే నౌకలోని పౌర సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.
ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించిన పలు నౌకలను అమెరికా దళాలు ఇలాగే నిలిపివేయగా, వందలాది వాణిజ్య నౌకలను దారి మళ్లించాయి. హార్ముజ్ జలసంధి మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ సైనిక చర్యల వల్ల అంతర్జాతీయ సరుకు రవాణా, చమురు సరఫరా మరియు వాణిజ్య నౌకల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని రక్షణ, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు పేర్కొంటున్నారు.