జాతీయ క్రీడల్లో జిల్లా యువత సత్తా చాటాలి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా జాతీయ క్రీడల్లో వికారాబాద్ జిల్లాకు చెందిన యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో ఖేలో ఇండియా జాతీయ క్రీడలకు సంబంధించిన లోగో, వాల్ పోస్టర్‌ను వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్ నగరాల్లో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడలపై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని క్రీడల శాఖ అధికారులకు సూచించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకొని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.