telangana
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా - అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ
Telangana
18 Nov 2026
55 views
సూర్య మంచిర్యాల: రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు,సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పథకం అమలుపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ప్రతి కుటుంబంలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన సంపాదించే ఒక వ్యక్తిని బీమా పరిధిలోకి తీసుకోవాలని సూచించారు.ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదిస్తున్నట్లయితే బీమా పొందే వ్యక్తిని కుటుంబ సభ్యులే ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలన్నారు.కుల, మత,ఆదాయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందించాలని స్పష్టం చేశారు.బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని పేర్కొన్నారు.నమోదు ప్రక్రియ కోసం గ్రామాలు,పట్టణాలు, వార్డుల వారీగా ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబాలను గుర్తించడంతో పాటు రేషన్ కార్డుల్లో పేర్లు లేని వారు,రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కూడా ప్రత్యేక దరఖాస్తు ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు.ఆధార్ ఆధారిత పుట్టిన తేదీ,కుటుంబ సభ్యులు,నామినీల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు.మీ సేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తుల నమోదు,ఇతర సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో పథకం అమలుకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)ను నోడల్ అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు,పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో నమోదు ప్రక్రియ చేపడతామని వివరించారు.పథకం అమలుపై ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు మండల,వార్డు స్థాయి అధికారులకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై శిక్షణ ఇస్తామని తెలిపారు.నమోదు శిబిరాల్లో ఇంటర్నెట్, ప్రింటర్,స్కానర్ వంటి సాంకేతిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.రెండు గ్రామాలు మినహా మిగిలిన అన్ని గ్రామాల్లో శిబిరాల ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.ప్రజాప్రతినిధులు,గ్రామపంచాయతీ సిబ్బంది,మున్సిపల్ అధికారులు,సంబంధిత శాఖల సమన్వయంతో అర్హులైన ప్రతి కుటుంబానికి పథకంపై అవగాహన కల్పించి,ఎవరూ మిగిలిపోకుండా నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ట్యాగ్లు:
Latest News