ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి
రామాయంపేట ; రామాయంపేట మండల పరిధిలోని తొనిగండ్ల, లక్ష్మాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో 2026 యాసంగి సీజన్‌లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.వరి పంటకు అధికంగా నీరు అవసరమవుతుందని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేసుకునే జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని వివరించారు. రైతులకు అవసరమైన మొక్కజొన్న, జొన్న విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డుతో రామాయంపేట వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించి విత్తనాలు పొందవచ్చని సూచించారు.అదేవిధంగా పామాయిల్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, పామాయిల్ మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలను రైతులకు తెలియజేశారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుని సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ ప్రత్యేక గ్రామసభల్లో సర్పంచ్ నవీన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, రైతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ప్రవీణ్ కుమార్, డీటీ, ఎంపీడీవో సలహుద్దీన్, పశువైద్యాధికారి, శ్రీనివాస్ విద్యుత్ శాఖ ఏఈ తిరుపతి రెడ్డి, నీటిపారుదల శాఖ ఏఈ, హౌసింగ్ ఏఈ, ఎంపీవో, ఏపీవో తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.