జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు. - డీఎస్పీ నరసింహారావు
అనకాపల్లి, నవంబర్ 19, మేజర్ న్యూస్: పట్టణంలో జరగనున్న జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ అత్యంత సామరస్యంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ తరఫున అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) తో పాటు 30 పోలీస్ యాక్ట్, 144 సి ర్ పిసి సెక్షన్ అమల్లో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు ఈ క్రింది నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. జడ్పీ కార్యాలయం, దాని పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున, జడ్పీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ గుమిగూడి ఉండరాదు. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకునే ఓటు హక్కు కలిగిన సభ్యులను (జడ్పీటీసీలను) మాత్రమే జడ్పీ కార్యాలయం లోపలికి అనుమతించడం జరుగుతుంది. ఇతరులకు లోపలికి ప్రవేశం లేదు. ఎన్నికలకు హాజరయ్యే జడ్పీటీసీ సభ్యుల వాహనాల పార్కింగ్ కోసం ఎన్టీఆర్ గ్రౌండ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. సమాచార పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) అధికారులు, పాత్రికేయుల (మీడియా) వాహనాల పార్కింగ్ కోసం జీవీఎంసీ కార్యాలయ ఆవరణలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పట్టణ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీస్ శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని డీఎస్పీ శ్రీ పి.వి.వి. నరసింహారావు కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
రిపోర్టర్ : నాగు యన్నంశెట్టి, అనకాపల్లి.