అధిక ప్రమాద గర్భిణులను ముందస్తుగా గుర్తించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్
సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధిక ప్రమాద గర్భిణులను ముందస్తుగా గుర్తించి, వారికి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు సకాలంలో రిఫర్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు.జిల్లాకు చెందిన ఏఎన్ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అధిక రక్తపోటు, రక్తహీనత, మధుమేహం తదితర సమస్యలు ఉన్న గర్భిణులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. హైరిస్క్ గర్భిణులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, ప్రమాద సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు.అధిక ప్రమాద గర్భిణులను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే గుర్తించి, మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు సకాలంలో తరలించాలని ఆదేశించారు. గర్భిణులకు నిరంతర వైద్య పర్యవేక్షణ అందిస్తూ సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్య సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రతి గర్భిణి సురక్షితంగా ప్రసవించేలా ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ నయీమ్ జహా, ఎన్‌హెచ్‌ఎం డీపీఓ ఉమా, ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.