telangana
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం - గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న మేయర్ దంపతులు
సూర్య నస్పూర్ : నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తూ, ఆత్మగౌరవంతో జీవించేలా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. సోమవారం కార్పొరేషన్ పరిధిలోని 31, 32వ డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 31వ డివిజన్‌లో లబ్ధిదారుడి నూతన ఇంటి నిర్మాణానికి కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డితో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించారు. 32వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి మేయర్ దర్ని మధుకర్, ఆయన సతీమణి సుజాత ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటిని అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవ, కృషితో నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యతతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. సొంతింటి ద్వారా పేద కుటుంబాలకు భద్రతతో పాటు సమాజంలో గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో హౌసింగ్ బోర్డు అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.