ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ప్రారంభం
సూర్య రంగారెడ్డి బ్యూరో :
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు, ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలను అందించే లక్ష్యంతో ఈ నూతన కమిషనరేట్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఈ పర్యటనలో భాగంగానే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) క్యాంపస్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సందర్శించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు, ఫ్యూచర్ సిటీ సమగ్ర అభివృద్ధి మరియు రాబోయే కార్యాచరణపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.