హకీంపేటలో రైతు మేళాకు సన్నాహాలు.. స్థలాలను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా
దుద్యాల, మేజర్ న్యూస్: కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో నవంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న రైతు మేళా ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో బహిరంగ సభ ప్రాంగణం, వ్యవసాయ అనుబంధ శాఖల స్టాళ్ల ఏర్పాటు, పార్కింగ్ స్థలాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేరా ఇతర అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు మేళాలో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో సుమారు 200 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలు, నూతన సాగు పద్ధతులు, వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. మేళాకు హాజరయ్యే రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, తాండూరు ఆర్డీవో అనిత, జిల్లా వ్యవసాయ అధికారి కవిత, తహసీల్దార్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.