గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
మేడ్చల్, మేజర్ న్యూస్: మేడ్చల్ పరిసర ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నూతనకల్ గ్రామ పరిధిలోని గ్రిప్ కంపెనీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని డబిల్‌పూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీశైలం మృతి చెందాడు. వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైన శ్రీశైలం రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉంది. వాహనాన్ని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీశైలం మృతితో డబిల్‌పూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.