ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు పిలుపు
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్: ఇజ్రాయెల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. సుదీర్ఘకాలం పాటు ప్రధానమంత్రిగా చక్రం తిప్పిన బెంజమిన్ నెతన్యాహుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ లేదా కూటమికి స్పష్టమైన మెజారిటీ రాని హంగ్ పార్లమెంట్ ఏర్పడిన నేపథ్యంలో, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ఆర్మీ చీఫ్ గడి ఐసెంకోట్‌కు దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మొదటి అవకాశం కల్పించారు. తీవ్ర ఉత్కంఠ రేపిన సంప్రదింపుల అనంతరం ఐసెంకోట్‌కే ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలను అప్పగించాలని అధ్యక్షుడు నిర్ణయించారు.
నెతన్యాహు కూటమికి తగ్గిన బలం.. ఐసెంకోట్‌కు 67 మంది ఎంపీల మద్దతు
ఇజ్రాయెల్ పార్లమెంట్ 'క్నెసెట్'లోని మొత్తం 120 స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్లు అవసరం. తాజా ఎన్నికల్లో నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 27 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, ఆయన మిత్రపక్షాలతో కూడిన మితవాద-జాతీయవాద కూటమి 53 సీట్ల వద్దే నిలిచిపోయింది. మరోవైపు గడి ఐసెంకోట్‌కు చెందిన 'యాషర్' పార్టీ 21 స్థానాలతో రెండవ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించగా, ఆయన నేతృత్వంలోని వ్యతిరేక కూటమి 48 సీట్లు సాధించింది. అయితే అరబ్ పార్టీలకు చెందిన 19 మంది ఎంపీలతో పాటు ఇతర విపక్ష పార్టీలు నెతన్యాహును అధికారం నుంచి తప్పించేందుకు ఐసెంకోట్‌కు మద్దతు ఇవ్వడంతో, ఆయనకు మొత్తం 67 మంది చట్టసభ సభ్యుల సిఫార్సులు లభించాయి. దీంతో అధ్యక్షుడు హెర్జోగ్ అధికారికంగా ఐసెంకోట్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
కూటమి ఏర్పాటుకు 28 రోజుల గడువు.. ఎదురవుతున్న సవాళ్లు
అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం గడి ఐసెంకోట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసి పార్లమెంట్‌లో బలాన్ని నిరూపించుకోవడానికి 28 రోజుల సమయం లభించింది (అవసరమైతే మరో 14 రోజుల పొడిగింపు ఉంటుంది). ఎంపీల సిఫార్సులలో సంఖ్యాబలం ఉన్నప్పటికీ, భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన సెంటర్-రైట్ జ్యూయిష్ పార్టీలు మరియు అరబ్ పార్టీలను కలుపుకుని స్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఐసెంకోట్‌కు కత్తిమీద సాములా మారింది.
ఒకవేళ నిర్దేశిత గడువులోగా ఐసెంకోట్ మెజారిటీని కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైతే, దేశం మళ్లీ ఎన్నికల వైపు వెళ్లాల్సి వస్తుంది. అప్పటివరకు నెతన్యాహు తాత్కాలిక ప్రధాని (కేర్‌టేకర్ పీఎం)గా కొనసాగుతారు. అయినప్పటికీ, ప్రత్యర్థి ఐసెంకోట్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తొలి అవకాశం దక్కడం ఇజ్రాయెల్ రాజకీయాల్లో నెతన్యాహు ఆధిపత్యానికి పెద్ద ఎదురుదెబ్బగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.