గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు సహించరు.. ఉప సర్పంచ్ అనంతప్ప
దౌల్తాబాద్, మేజర్ న్యూస్: గ్రామ అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చూడటం సమంజసం కాదని, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ప్రజలు సహించరని సూరయపల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ అనంతప్ప అన్నారు. మండల పరిధిలోని సూరయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల సాలింపూర్ గ్రామంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులపై కొందరు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి పనుల విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం, ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదని హితవు పలికారు. ఈ సందర్భంగా అనంతప్ప మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ తీర్మానం ప్రకారం తొలుత సాలింపూర్ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులను 24 అడుగుల వెడల్పుతో చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే గ్రామ ప్రజల అభిప్రాయాలు, వారి సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల నిర్ణయం మేరకు రోడ్డు వెడల్పును 20 అడుగులకు కుదించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతుంటే వాటికి సహకరించాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ముందుగా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ గ్రామ అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. గతంలో అభివృద్ధికి నోచుకోని అనేక గ్రామాల్లో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామాల్లో రోడ్ల విస్తరణతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందడంతో పాటు భవిష్యత్తులో మరింత అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులను రాజకీయ కోణంలో చూడకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామ ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చెల్లాపూర్ సర్పంచ్ రోజా రమేష్, మాజీ సర్పంచ్ శరణయ్య, శివకుమార్, మాణిక్యప్ప, శ్రీనివాస్ రెడ్డి, వీరేశం, ప్రేమారాజ్, ఆనంద్, విష్ణు, మొగుళప్ప, వార్డు సభ్యులు పండారప్ప, అశోక్, బి. శ్రీను, బి. శ్యామప్ప, కనుకప్ప, గోవింద్, కావాలి నర్సింలు, కుమ్మరి నర్సింలు, కోలుముల రాజు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.