అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా అందించాలి: ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్
మేడ్చల్, మేజర్ న్యూస్ : ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా అన్ని వార్డు కార్యాలయాల్లో నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి అనుకోని ప్రమాదానికి గురై మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డు కార్యాలయాల్లో నెల రోజుల పాటు ఇందిరమ్మ జీవిత బీమా నమోదు సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో సంబంధిత వార్డు కార్యాలయాలకు వెళ్లి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్హత ఉన్నప్పటికీ నమోదు చేసుకోకుండా ఈ అవకాశాన్ని ఎవరూ కోల్పోవద్దని ఆమె కోరారు.