ఘనంగా 21 హనుమాన్ చాలీసా పారాయణం
సూర్య వీణవంక: మండలంలోని కనపర్తి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి ప్రతిష్ఠాపన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం శ్రీ అభయాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో 21 హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కనపర్తి గ్రామ సర్పంచ్ మహాకళ ఉమా సాంసుందర్ రెడ్డి, ఉప సర్పంచ్ పార్లపెల్లి బొందయ్య, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులతో పాటు నర్సింగాపూర్, జగ్గయ్యపల్లి భజన మండలులకు చెందిన భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తులు అత్యంత నిష్ఠతో, ఉత్సాహంగా పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.
శ్రీ అభయాంజనేయ స్వామి భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కనపర్తి గ్రామానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పద్మ యాదగిరి, బంగారు సారయ్య, పంజాల రాజు, పంజాల అనిల్, అనుమండ్ల గోపాల్ రెడ్డి, తడిగుప్పుల శ్రీనివాస్, పార్లపెల్లి బిక్షపతి, సిలివేరి శ్రీనివాస్, బొంగోని చంద్రు, కొండూరు యాదగిరి, సిలివేరి సదయ్య, ముత్యాల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.