గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి – డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్
• మాతృ, శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :
జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు. గురువారం మంచిర్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మాతృ, శిశు మరణాలపై సమీక్ష, ఆడిట్ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జిల్లాలో నమోదైన రెండు మాతృ మరణాలు, ఆరు శిశు మరణాలపై వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తల సమక్షంలో సమగ్రంగా సమీక్షించారు. మరణాలకు దారితీసిన పరిస్థితులు, కారణాలు, వైద్య సేవల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి ఉపకేంద్రం పరిధిలో గర్భిణులను గర్భధారణ జరిగిన 90 రోజులలోపు తప్పనిసరిగా నమోదు చేయాలని, నాలుగు విడతలుగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన టీకాలు వేయించాలని సూచించారు. రక్తహీనత ఉన్న గర్భిణులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందించడంతో పాటు అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలని తెలిపారు. ప్రతి నెల 9వ తేదీన నిర్వహించే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో గర్భిణులందరికీ పరీక్షలు చేయించాలని ఆదేశించారు. గర్భిణుల్లో రక్తహీనత, తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తస్రావం, మూర్ఛ, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, ఛాతిలో నొప్పి, కాళ్ల వాపులు, ఉమ్మనీరు ముందుగా పోవడం, 12 గంటలకు పైగా ప్రసవ నొప్పులు వంటి ప్రమాద సూచనలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఇందుకోసం 108 అంబులెన్స్, అమ్మఒడి వాహన సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని, పండ్లు, పాలు, ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు వంటి ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఐరన్, కాల్షియం మాత్రలను నిర్ణీత వ్యవధితో తీసుకోవాలని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ముందుగానే వైద్యులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రతి గర్భిణికి ప్రసవ ప్రణాళిక ఉండాలని, ఏ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవాలని ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులకు, తల్లులకు మాతా శిశు సంరక్షణ కార్డుల ప్రాధాన్యతను వివరించాలని, ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత అందించే ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు.
శిశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని, తల్లిపాల ప్రాముఖ్యతను తల్లులకు వివరించాలని తెలిపారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను నిరంతరం గమనించాలని, ప్రతి జననాన్ని నమోదు చేసి జనన ధ్రువీకరణ పత్రం పొందేలా చూడాలని ఆదేశించారు. మాతృ, శిశు మరణాల నివారణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని సూచించారు. ఈ సమీక్షలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ కుమారస్వామి, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణశ్రీ, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ హిమబిందు, డాక్టర్ స్వరూప, డాక్టర్ నాగవేణి, డాక్టర్ కీర్తి, డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ ప్రణీత, డాక్టర్ విక్రమ్, డాక్టర్ ప్రీతి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్, ఆర్.ఎస్. పద్మ, శ్రీనివాస్, దూప్ సింగ్, వెంకటసాయి, సదన్, డాక్టర్ స్పూర్ణ, డాక్టర్ లహరితో పాటు నర్సింగ్ అధికారులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.