telangana
ఎఫ్‌సీఐ డిపోలో స్వచ్ఛతా అభియాన్
సూర్య, మంచిర్యాల టౌన్: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతతో పాటు సమర్థవంతమైన నిర్వహణను ప్రోత్సహించే లక్ష్యంతో మంచిర్యాల భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) డిపోలో శనివారం స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం పరిసరాలను శుభ్రం చేయడానికే పరిమితం కాకుండా, నిరుపయోగ వస్తువుల తొలగింపు, రికార్డుల క్రమబద్ధీకరణపై కూడా అధికారులు దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో డిపో అధికారులు, ఉద్యోగులు, హమాలీ కార్మికులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. గోదాములు, ధాన్యం నిల్వ ప్రాంతాలు, డ్రైన్లు, ఇతర ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శ్రమదానం ద్వారా తొలగించారు. డిపో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. డిపోలో వినియోగంలో లేని పాత పరికరాలు, స్క్రాప్ వస్తువులను నిబంధనల ప్రకారం వేలం వేసి తొలగించేందుకు చర్యలు చేపట్టారు. వీటి తొలగింపుతో ఖాళీ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. కార్యాలయంలో పేరుకుపోయిన పాత భౌతిక, డిజిటల్ ఫైళ్లను పరిశీలించి, నిబంధనల మేరకు అవసరం లేని రికార్డులను తొలగిస్తూ రికార్డుల నిర్వహణను మెరుగుపరిచే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను సక్రమంగా సేకరించి తొలగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డివిజనల్ మేనేజర్, డిపో మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్‌తో పాటు ఉద్యోగులు, కార్మికులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.