telangana
ఎల్‌నినో విపత్తును ఎదుర్కొనే శక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మవారు ప్రసాదించాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ఎల్‌నినో వంటి ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోచమ్మ తల్లి ప్రసాదించాలని తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. కరువు పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండేలా అమ్మవారు ఆశీర్వదించాలని ప్రార్థించినట్లు తెలిపారు.వికారాబాద్ నియోజకవర్గం వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు గ్రామంలో నిర్వహిస్తున్న పోచమ్మ తల్లి మూడో వార్షిక జాతర వేడుకల్లో శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ…. పోచమ్మ తల్లి జాతరలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జాతరను ఘనంగా నిర్వహిస్తున్న గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులను హృదయపూర్వకంగా అభినందించారు. పోచమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలతో పాటు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే విపత్తులను అధిగమించి, కరువు పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, గ్రామంలో ఐక్యత, సంతోషం, శాంతి వెల్లివిరియాలని కోరుకున్నారు. జాతర సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.అంతకుముందు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.