ఏజెన్సీలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.
అశ్వారావుపేట ఏజెన్సీలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. కుళ్ళిన గుడ్లను అమ్ముతున్న కిరాణా వ్యాపారులు!
రూ. 8 పెట్టి గుడ్డు కొంటే ఉడికిస్తే విపరీతమైన దుర్వాసన
అమాయక గిరిజనులను నిలువునా మోసం చేస్తున్న వైనం
అధికారుల పర్యవేక్షణ కరువు.. తక్షణ చర్యలకు ప్రజల డిమాండ్
అశ్వారావుపేట, : ఆర్ సి సూర్య( మేజర్ న్యూస్)
అశ్వారావుపేట మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాలలో కిరాణా షాపుల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏజెన్సీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో నివసించే అమాయక, తెలిసీ తెలియని గిరిజన ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొందరు కిరాణా వ్యాపారులు నాణ్యత లేని, కుళ్ళిన గుడ్లను అమ్ముతూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
మండలంలో ఒక్కో గుడ్డును రూ. 8 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తుండగా.. తీరా వాటిని ఇంటికి తీసుకెళ్లి ఉడికిస్తే విపరీతమైన దుర్వాసన వస్తోందని వినియోగదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు నిత్యం పౌష్టికాహారంగా భావించి తినే గుడ్ల విషయంలో ఈ తరహా మోసాలు ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం తినే ఆహార పదార్థాలలో నాణ్యత లేకపోవడమే కాకుండా, కుళ్ళిపోయిన గుడ్లను అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీ గ్రామాల అమాయక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి అనైతిక వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ (ఆహార భద్రత) మరియు సంబంధిత రెవెన్యూ, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. మండలంలోని కిరాణా షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రజలు, వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.