ఈనెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు • సీనియర్ జర్నలిస్టులకు సన్మానం
సూర్య, మంచిర్యాల : ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈనెల 28న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి మధు, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యగౌడ్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు కెమెరా వెంకటస్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని మైక్రో కంప్యూటర్ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులను సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. 1950 అక్టోబర్ 28న ఢిల్లీలో సీనియర్ పాత్రికేయులచే స్థాపించబడిన ఐఎఫ్‌డబ్ల్యూజే, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తోందని తెలిపారు.
ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాలోనూ వేడుకలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ, జర్నలిస్టులు, ఫెడరేషన్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.