ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు, మేజర్ న్యూస్ :
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. నగర శివారులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సోమవారం ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ కోసం చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి అందిస్తున్న శిక్షణపై ఆరా తీశారు. కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు, కేటగిరీల వారీగా పేపర్లను వేరుచేసి 25 చొప్పున కట్టలు కట్టడం, వాటిని ఓటు వేసిన వారి సంఖ్యతో సరిపోల్చడం, లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ హాలులో తగినంత వెలుతురు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, అధికారులు, ఏజెంట్లకు వేర్వేరు ప్రవేశ మార్గాలు తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా మొత్తం లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతాపరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఇదే ప్రాంగణంలో కందుకూరు, కొండపి నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎలక్షన్స్ నోడల్ అధికారి వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో చిరంజీవి, ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల ఆర్వోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.