తుఫాన్ ముప్పు.. రైతుల్లో గుబులు! చేతికందే దశలో వరి పంట.. అన్నదాతల్లో ఆందోళన
అవనిగడ్డ, మేజర్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాన్ బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దివిసీమ రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగు అంతంతమాత్రంగా సాగడం, నాట్ల సమయంలో సాగునీరు అందకపోవడంతో ఇంజిన్ల ద్వారా నీటిని తోడి, అదనపు పెట్టుబడులు పెట్టి పంటను సాగు చేసిన రైతులకు తుఫాన్ వార్త పిడుగులా మారింది.మరో నెల రోజుల్లో పంట చేతికందుతుందని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు తుఫాన్ ముప్పు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముందుగా నాట్లు వేసిన పొలాల్లో వరి పంట కోతకు వచ్చే దశకు చేరుకోగా, మరికొన్ని చోట్ల పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో బలమైన గాలులు వీస్తే వరి పంట నేలవాలి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన తమకు తుఫాన్ మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగంతీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించారు. మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, మత్స్య, అగ్నిమాపక శాఖల సమన్వయంతో తుఫాన్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణా జిల్లా.