అనారోగ్యంతో బాధపడుతున్న కమెడియన్ రామచంద్రకు అండగా నిలిచిన టాలీవుడ్ నటుడు బాబూరావు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామచంద్ర ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్లిష్ట పరిస్థితులలో ఆయనకు ఆర్థికంగా సహాయం చేసేందుకు తోటి నటులు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు బాథిన దశరథ అలియాస్ బాబూరావు ఆయనను నేరుగా పరామర్శించి, ఆర్థిక సాయం అందజేసి తన మంచితనాన్ని చాటుకున్నారు. తోటి కళాకారుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం పట్ల సినీ వర్గాలలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యల కారణంగా సరైన ఉపాధి లేక, వైద్య ఖర్చులు భరించలేక రామచంద్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నటుడు బాబూరావు వెంటనే స్పందించి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, తక్షణ వైద్య సహాయం కోసం తన వంతుగా ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో ఉన్న తోటి కళాకారుడికి అండగా నిలవడం మన అందరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటారN, కానీ వారి వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఎవరికీ తెలియవు. అలాంటి సమయంలో చిత్ర పరిశ్రమ నుంచి కొద్దిమంది మాత్రమే ముందుకు వచ్చి ఆదుకోవడం నిజంగా అభినందనీయం. నటుడు బాబూరావు చూపిన ఈ మానవతా దృక్పథంపై సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఎంతో స్పందిస్తూ ఆయనను అభినందిస్తున్నారు. రామచంద్ర త్వరగా కోలుకుని మళ్లీ పూర్వంలా ఆరోగ్యంగా నవ్వులు పంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.