ఏడాదిగా అసంపూర్తిగానే రోడ్డు పనులు!
కొండాపూర్ ; ప్రజా రవాణాకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు ఏడాది గడుస్తున్నా పూర్తికాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మండల పరిధిలోని మల్లేపల్లి నుంచి హరిదాస్ పూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి 2025లో రూ.15 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ సింగిల్ రోడ్డుకు ఇరువైపులా రోడ్డు విస్తరణ కోసం కటింగ్లు చేసి, మట్టి పోసి కంకర పనులు పూర్తి చేశారు. బి టి రోడ్డు వేయాల్సిన దశలోనే పనులు నిలిచిపోయాయి.సుమారు ఏడాది కావస్తున్నా రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్ కొంతమేర పనులు చేపట్టి మధ్యలోనే వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చేసిన పనులకు బిల్లులు అందితే మిగిలిన పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ తెలిపినట్లు సమాచారం.
నిధుల కొరతా.. బిల్లుల జాప్యమా?
ప్రజలకు ఉపయోగపడాల్సిన రోడ్డు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిధుల కొరత కారణమా.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యమా.. లేక అధికారుల పర్యవేక్షణ లోపమా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించి, రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.