డిండి ప్రాజెక్టు పేరుతో నల్గొండ కు నీరు తరలించే కుట్ర
- జేఏసీ చైర్మన్ సదానందం గౌడ్
ఆమనగల్లు రంగారెడ్డి:
పాలమూరు జిల్లా ప్రజలు త్రాగు సాగునీరు కోసం తంటాలు పడుతుంటే డిండి ప్రాజెక్టు పేరుతో నల్గొండ జిల్లాకు నీరు తరలించే కుట్ర జరుగుతుందని రైతు ఉద్యమ నాయకుడు, కల్వకుర్తి జేఏసీ చైర్మన్ సదానందం గౌడ్ ఆరోపించారు. శుక్రవారం మాట్లాడుతూ మా పొట్టలు కొట్టి మా భూములను ముంచి నీళ్లు తీసుక పోవద్దని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాలో 300 కిలోమీటర్లు కృష్ణా నది ప్రవహిస్తున్న 80 ఏళ్లుగా జిల్లా రైతులకు సాగు తాగునీరు అందడం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు, పాలకులు, నేతలు మారుతున్న ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల బ్రతుకులు మారడం లేదని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాను కరువు, వలసల జిల్లాగా మార్చి నీళ్ల పంపిణీలో తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. స్వరాష్ట్రంలో నల్గొండ జిల్లా రాజకీయ నాయకుల ఆధిపత్యంతో డిండి ప్రాజెక్టు పేరుతో నీళ్ల దోపిడీకి తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా రైతుల పక్షాన ఉద్యమించడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాలేని దుస్థితిలో జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులతో సత్యాగ్రహ దీక్షలు, మహా పాదయాత్ర, మహా ధర్నా కార్యక్రమాలను నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించేలా చేశాయని ఆయన వివరించారు. అందుకు స్పందించిన ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఏక తాటి పైకి తీసుకురావడంలో జేఏసీ సక్సెస్ అయిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే డిండి ప్రాజెక్టును రద్దుచేసి జిల్లా రైతాంగానికి న్యాయం చేయాలని కోరారు. జిల్లాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం నల్గొండ జిల్లా రైతులకు నాగార్జున సాగర్, శ్రీశైలం, గుర్రంపోడు, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టుల ద్వారా మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించాలని సూచించారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.