డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు వార్షిక ఇంక్రిమెంట్ వెంటనే మంజూరు చేయాలి : పీఆర్టీయూ టీఎస్ కృష్ణ మండల నాయకులు
కృష్ణ సూర్య న్యూస్ :
మండలంలో పనిచేస్తున్న డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు నిలిచిపోయిన వార్షిక ఇంక్రిమెంట్‌ను ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వుల ఆధారంగా వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూ టీఎస్ కృష్ణ మండల శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నాయకులు శుక్రవారం విద్యాశాఖ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ మండల సంఘం నాయకులు మాట్లాడుతూ నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా ఈ నెల 18న ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు అందుకున్న 22 మంది ఉపాధ్యాయులకు గత నెల నుంచి నిలిచిపోయిన వార్షిక ఇంక్రిమెంట్‌ను తక్షణమే వర్తింపజేయాలని కోరారు. అదేవిధంగా వార్షిక ఇంక్రిమెంట్ మంజూరుతో పాటు, గత నెలకు సంబంధించిన బకాయి (ఏరియర్స్) మొత్తాన్ని వెంటనే ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.మండల విద్యాధికారి నిజాముద్దీన్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గణేశ్ సింగ్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సంతోషి లను సంఘం నాయకులు కలిసి సమస్యలను వివరించగా, వారు సానుకూలంగా స్పందించారు. పెండింగ్ ఏరియర్స్ జమ చేస్తామని, ఈ నెల నుంచే వార్షిక ఇంక్రిమెంట్‌తో కూడిన వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ కృష్ణ మండల అధ్యక్షులు దండు శేఖర్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, గౌరవ అధ్యక్షులు ఎన్. శివరాజ్‌లతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు ఎం.ఆర్. అజయ్, తిరుమలరావు, శ్రీనివాసులు, చంద్రశేఖర్, అర్జున్, రామకృష్ణ, రాజన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం