చెరుకు టన్నుకు రూ.4,500 ఇవ్వాల్సిందే!
ఝరాసంగం;పాక్షిక కరువు ప్రభావంతో చెరుకు దిగుబడి తగ్గే పరిస్థితులు నెలకొనడం, సాగు పెట్టుబడులు పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చెరుకు టన్నుకు రూ.4,500 మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని ఝరాసంగం మండలంలోని స్థానిక చెరుకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేయడం, బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గడం, విద్యుత్ సరఫరా సమస్యలతో సాగు ఖర్చులు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అక్టోబర్ 24న జారీ చేసిన జీవో నంబర్ 3 ద్వారా ఝరాసంగం మండలాన్ని ప్రభుత్వం కరువు ప్రభావిత మండలంగా ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో చెరుకు పంటకు నిరంతర నీటి అవసరం ఉండటంతో బోరుబావులపై ఆధారపడుతున్న రైతులకు నీటి పారుదల ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయి. కూలీలు, ఎరువులు, పురుగుమందులు, విద్యుత్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడి తగ్గితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణలోనే అధిక ధర ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం 2026–27 సీజన్‌కు చెరకు ఎఫ్‌ఆర్‌పీని క్వింటాలుకు రూ.365, అంటే టన్నుకు రూ.3,650గా నిర్ణయించింది. దీనికి అదనంగా హర్యానా 2026–27లో టన్నుకు రూ.4,300, పంజాబ్ 2025–26లో రూ.4,160, ఉత్తరప్రదేశ్ 2025–26లో చెరకు రకాన్ని బట్టి రూ.3,900 నుంచి రూ.4,000 వరకు ధర ప్రకటించాయి. ఇతర రాష్ట్రాల ధరలను పరిశీలించి తెలంగాణలోనూ టన్నుకు రూ.4,500 చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.పాక్షిక కరువు ప్రభావంతో దిగుబడి తగ్గే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూ.4,500 మద్దతు ధరతో పాటు అవసరమైన ప్రత్యేక కరువు ప్రోత్సాహకం లేదా పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. మండల వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా చెరుకు సాగు విస్తీర్ణం, పంట పరిస్థితి, భూగర్భ జలాల లభ్యత, దిగుబడి అంచనాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. చెరకు కొనుగోళ్లు సకాలంలో చేపట్టి రైతులకు బకాయిలు ఆలస్యం చేయకుండా చెల్లించాలి. కేవలం కరువు ప్రభావిత మండలంగా ప్రకటించడంతో సరిపెట్టకుండా, టన్నుకు రూ.4,500 మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఝరాసంగం చెరుకు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.