బొంరాస్‌పేటలో పండగల సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనం.. అధికారిక గుర్తింపుపై ముదిరాజ్ సంఘం హర్షం
బొంరాస్‌పేట, మేజర్ న్యూస్: తెలంగాణ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన పండగల సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు బొంరాస్‌పేట మండల కేంద్రంలో గురువారం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని భూలక్ష్మి చౌరస్తాలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముదిరాజ్ సంఘం నాయకులు, అభిమానులు పాల్గొని సాయన్న ముదిరాజ్ సేవలను స్మరించుకున్నారు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయం ముదిరాజ్ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… పండగల సాయన్న ముదిరాజ్ ధైర్యసాహసాలు, ప్రజల పట్ల ఆయన చూపిన సేవాభావం, అన్యాయాన్ని ఎదిరించిన పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సామాజిక చైతన్యం పెంపొందించడంలో ఇలాంటి మహనీయుల చరిత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం సాయన్న ముదిరాజ్ జయంతికి అధికారిక గుర్తింపు ఇవ్వడం ఆయన సేవలను సమాజం మరింత విస్తృతంగా స్మరించుకునేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.సాయన్న ముదిరాజ్ చరిత్రను గ్రామగ్రామాన ప్రచారం చేస్తూ యువతకు ఆయన జీవిత విశేషాలు, సేవలు, పోరాట పటిమను తెలియజేయాలని పిలుపునిచ్చారు. జయంతి వేడుకలను ప్రతి ఏడాది ఐకమత్యంతో, పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ సమాజ ఐక్యతను చాటాలని కోరారు. ఈ ఉత్సవాలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా మహనీయుల ఆశయాలను ఆచరణలోకి తీసుకువచ్చే వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సేరి రాజేష్ రెడ్డి, వీబీజీ రాంజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గండిడ్ నరసింహులు గౌడ్, స్థానిక సర్పంచ్ కొవ్వూరు వీరేశలింగం, బి. నరసింహులు నాయుడు, బి. బాబాయ్ నాయుడు, తిరుపతయ్య, జగదీష్ సాగర్, శేఖర్ యాదవ్, నరేందర్, మైపాల్, పి. అనంతయ్య, కె. అంజిలయ్యతో పాటు ముదిరాజ్ సంఘం నాయకులు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
రిపోర్టర్: శ్రీశైలం, బొంరాస్ పేట్, వికారాబాద్ జిల్లా.