మీడియా ని ఎలో చెయ్యని రిటర్నింగ్ అధికారి....
జగ్గయ్యపేట రూరల్ మేజర్ :-నామినేషన్ల వద్ద మీడియాకు కనీస సౌకర్యాలు కరువు..టెంట్ లేదు.. కుర్చీలు లేవు.. అడిగితే నిర్లక్ష్యపు సమాధానాలు..అధికారుల తీరుపై మీడియా ప్రతినిధుల అసంతృప్తి…ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న మండల పరిషత్ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించే మీడియా ప్రతినిధుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
నామినేషన్ల దాఖలు కోసం వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు, వారి అనుచరులు మండల పరిషత్ కార్యాలయానికి వస్తుండగా, ఎన్నికల సమాచారాన్ని సేకరించేందుకు వచ్చే మీడియా ప్రతినిధులకు కనీస వసతులు కూడా కల్పించకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఎండలో నిలబడేందుకు కనీసం టెంట్ ఏర్పాటు చేయకపోగా, కూర్చునేందుకు కుర్చీలు కూడా వేయకపోవడంపై మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
*అడిగితే నిర్లక్ష్యపు సమాధానాలా?*
మీడియా ప్రతినిధులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని సంబంధిత అధికారులను ప్రశ్నించగా, అవసరం లేదన్నట్లుగా సమాధానాలు ఇస్తున్నారని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా, “మాకు ఇవే నిబంధనలు” అంటూ అధికారులు బహిరంగంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా సమాచార సేకరణకు వచ్చే మీడియా ప్రతినిధుల పట్ల ఇలాంటి వైఖరి సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు.. ఇక్కడ మాత్రం నిర్లక్ష్యమా?
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల కవరేజీ కోసం మీడియా ప్రతినిధులకు ప్రత్యేక గ్యాలరీలు, కూర్చునే సదుపాయాలు కల్పిస్తున్న సందర్భంలో, ఇక్కడ కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ప్రజలకు చేరాలంటే మీడియా ప్రతినిధులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు పేర్కొంటున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాలి
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అభ్యర్థులకు, ఎన్నికల సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లతో పాటు మీడియా ప్రతినిధులు తమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు కూడా తగిన సదుపాయాలు కల్పించాలని మీడియా వర్గాలు కోరుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే కనీస వసతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా