దక్షిణ కొరియా కాలువలో 10 అడుగుల అరుదైన షార్క్ హైడ్రామా:
సముద్రంలోకి పంపిన కొద్ది గంటల్లోనే తిరిగి కాలువలోకి ఈత.. మూడో ప్రయత్నమూ విఫలం కావడంతో అధికారుల తలపట్టుడు!
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్, సియోల్: దక్షిణ కొరియాలోని బుసాన్ (Busan) నగర తీరప్రాంత కాలువలో చిక్కుకున్న 10 అడుగుల అరుదైన అంతరించిపోతున్న జాతి షార్క్ (Dusky Shark) కథ సరికొత్త మలుపు తిరిగింది. దాదాపు నెల రోజులుగా కాలువలోనే ఉంటూ ప్రజలను విపరీతంగా ఆకర్షించిన ఈ ఆడ షార్క్‌ను ఎట్టకేలకు బుధవారం నాడు విజయవంతంగా సముద్రం వైపు నడిపించినట్లు భావించిన రెస్క్యూ బృందాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సురక్షితంగా బయటకు పంపిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆ షార్క్ తిరిగి రక్షణ వలల కింద నుంచి ఈదుకుంటూ కాలువలోకి వచ్చేసింది. దీంతో ఈ విచిత్రమైన వ్యవహారం దక్షిణ కొరియా సముద్ర పర్యావరణ అధికారులకు పెద్ద సవాలుగా మారింది.
సముద్రం వైపు నడిపించేందుకు మూడో రెస్క్యూ ఆపరేషన్:
'బుకాంగి' అని స్థానికులు ముద్దుగా పిలుచుకుంటున్న ఈ డస్కీ షార్క్ సెప్టెంబర్ 18న బుసాన్‌లోని నార్త్ పోర్ట్ వాటర్‌ఫ్రంట్ పార్క్ సమీపంలోని కృత్రిమ కాలువలోకి ప్రవేశించి బయటకు వెళ్లలేకపోయింది. అప్పటి నుంచి దీనిని సముద్రంలోకి పంపేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించాయి:
సెప్టెంబర్ 29 (మొదటి ప్రయత్నం): బోట్ల ద్వారా నీటి జెట్లను ప్రయోగించి తోలేందుకు ప్రయత్నించగా, షార్క్ బోట్ల కింద నుంచి తప్పించుకుని లోపలికే ఉండిపోయింది.
అక్టోబర్ 2 (రెండో ప్రయత్నం) 50 మీటర్ల పొడవైన వలను ఉపయోగించి బయటకు తీసుకురావాలని చూసినా, ఆటుపోట్ల సమయంలో వల నేలకట్టకు చిక్కుకుపోవడంతో ఆపరేషన్ విరమించాల్సి వచ్చింది.
బుధవారం (మూడో ప్రయత్నం): భారీ ఫ్లోటింగ్ పాంటూన్ ప్లాట్‌ఫారమ్, డైవర్లు, డ్రోన్ల సహాయంతో దాదాపు ఒక కిలోమీటరు మేర ముందుకు నెట్టుకుంటూ సముద్ర ముఖద్వారం వరకు తీసుకెళ్లారు. వందలాది మంది ప్రజలు తీరం వెంబడి నిలబడి ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు.
కొద్ది గంటల్లోనే తిరుగుప్రయాణం:
బుధవారం సాయంత్రం కాలువ ముఖద్వారం సమీపంలోని ఓ పీర్ వద్ద కనిపించిన బుకాంగి, రాత్రి అయ్యేసరికి మళ్లీ కాలువ వైపు ఈదింది. బయటి వలల కింద నుంచి లోపలికి చొరబడి కాలువ లోపలి వల మరియు బయటి వల మధ్య ప్రాంతంలో చిక్కుకుంది. గురువారం నాడు ఈ విషయాన్ని దక్షిణ కొరియా సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. లోపలికి మరింత దూరం వెళ్లకుండా అడ్డంకులను పటిష్టం చేశామని, బయటి వలను తెరిచి ఉంచామని అధికారులు తెలిపారు.
పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ శీతాకాల ముప్పు:
ప్రస్తుతానికి షార్క్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆహారం కోసం అది ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ నిపుణులు వెల్లడించారు. అయితే రాబోయే రోజుల్లో నీటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్న నేపథ్యంలో కాలువలో ఎక్కువ కాలం ఉండటం దాని ప్రాణాలకు ముప్పని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని సురక్షితంగా బయటకు పంపేందుకు నిపుణులు నూతన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ అరుదైన షార్క్‌ను చూసేందుకు ఇప్పటివరకు 16 లక్షల మందికి పైగా పర్యాటకులు ఈ తీరప్రాంతాన్ని సందర్శించడం విశేషం.