telangana
భీమేశ్వరాలయంలో భక్తుల సందడి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దసరా, బతుకమ్మ సెలవులు ముగింపు దశకు చేరుకోవడం, ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించడంతో పాటు అభిషేకాలు, అన్నపూజలు, కుంకుమ పూజలు, గండాదీపం, చండీ హోమం, నిత్య కల్యాణం తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈవో రమాదేవి, డీఈవో ప్రతాప నవీన్ కుమార్ ఆలయ ప్రాంగణంలో పర్యటించి క్యూలైన్లు, ప్రసాద వితరణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆలయ ఉద్యోగులకు, భద్రతా సిబ్బందికి సూచనలు చేశారు.