బాల్య వివాహాల నిర్మూలనకు మహిళా సంఘాలు ముందుండాలి
బాల్య వివాహాల నిర్మూలనకు మహిళా సంఘాలు ముందుండాలి
-ఆశ్రిత సంస్థ కోఆర్డినేటర్ గణేష్
సిద్దిపేట రూరల్ : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ గణేష్ పిలుపునిచ్చారు.గురువారం అర్బన్ ఏపీఎం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అర్బన్ మండల స్థాయి మహిళా సమాఖ్య సమావేశంలో బాల్య వివాహాల అనర్థాలు, స్మార్ట్‌ఫోన్ వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల విద్యకు ఆటంకంగా మారడమే కాకుండా, వారి ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. బాలికలకు విద్య, భద్రత కల్పిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అలాగే, స్మార్ట్‌ఫోన్లను అవసరమైన మేరకే వినియోగించాలని, అతిగా వినియోగించడం వల్ల పిల్లల చదువు, ఆరోగ్యం, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. పిల్లలు ఫోన్లలో చూసే అంశాలపై తల్లిదండ్రులు నిఘా ఉంచడంతో పాటు, సాంకేతికతను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.గ్రామస్థాయిలో మహిళా సంఘాల సభ్యులు బాల్య వివాహాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి, వాటిని అడ్డుకోవడంలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రమేష్,మౌనిక,వీణ,మహిళ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
(సూర్య రూరల్, రమేష్)