telangana
గ్రంథాలయాల సమగ్ర అభివృద్ధికి కృషి -జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి.
సూర్య నిజామాబాద్ అర్బన్ : జిల్లాలోని గ్రంథాలయాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, విద్యావంతులు, సీనియర్ సిటిజన్లకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను సత్కరించి పండుగ శుభాకాంక్షలు అందజేశారు. కలెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలను స్వీకరించారు. అనంతరం జిల్లాలోని గ్రంథాలయాల సమగ్ర అభివృద్ధి, పాఠకులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు. ముఖ్యంగా గ్రూప్స్, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్, పోలీస్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉపయోగపడే పోటీ పరీక్షల పుస్తకాలు, జనరల్ నాలెడ్జ్ గ్రంథాలు, ప్రామాణిక అధ్యయన సామగ్రి, దినపత్రికలు, మాసపత్రికలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని వివరించారు. అదేవిధంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అవసరమైన అధ్యయన సామగ్రి, విద్యావంతులకు ఉపయోగపడే విజ్ఞాన సంబంధిత పుస్తకాలు, జీవిత చరిత్రలు, సాహిత్య గ్రంథాలను అందుబాటులోకి తీసుకురావడంపై చర్చించారు. సీనియర్ సిటిజన్ల అభిరుచులకు అనుగుణంగా పుస్తకాలను సమకూర్చడంతో పాటు అన్ని వర్గాల పాఠకులకు గ్రంథాలయాలు మరింత చేరువ కావాల్సిన అవసరాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రంథాలయాల్లో పుస్తకాల సంఖ్యను పెంచడంతో పాటు పఠనానికి అనుకూలమైన వాతావరణం, మెరుగైన సౌకర్యాలు, అవసరమైన మౌలిక వసతులను కల్పించడం ద్వారా గ్రంథాలయాలను విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చైర్మన్ ఆకాంక్షించారు. జిల్లాలోని గ్రంథాలయాలను బలోపేతం చేసి విద్యార్థులు, యువత, పాఠకులకు మరింత నాణ్యమైన సేవలు అందించేలా అభివృద్ధి చర్యలు చేపట్టే అంశాలపై జిల్లా కలెక్టర్‌తో చర్చించారు.