telangana
ఎల్‌నినో నేపధ్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి - అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : ఎల్‌నినో ప్రభావంను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా రానున్న రోజుల్లో తాగునీరు, విద్యుత్ అవసరాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. యాసంగి సీజన్‌లో వరి సాగు చేయకుండా క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సంప్రదాయంగా వస్తున్న వరి పంటకు బదులుగా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ రానున్న రోజుల్లో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా అధిగమించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ఎల్ నినో ప్రభావం నేపధ్యంలో చేపట్టాల్సిన చర్యల విషయమై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేశారు. ఎల్‌నినో ప్రభావం అంతకంతకు తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా, రానున్న పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యాసంగిలో వరి సాగుకు నీటి సరఫరా అందుబాటులో ఉండే అవకాశం లేనందున వరి సాగు చేయవద్దని గ్రామగ్రామాన రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. తక్కువ నీటితో, స్వల్ప వ్యవధిలో దిగుబడులు అందించే ప్రత్యామ్నాయ పంటల గురించి రైతులకు తెలియజేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ పామ్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా చూడాలన్నారు. గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి వివరించాలని తెలిపారు. రైతులు నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా వరి విత్తుకుంటే నష్టపోయే ప్రమాదం ఉన్నందున ముందస్తుగానే వారికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. రానున్న ఎనిమిది నుండి పది నెలలకు సంబంధించి గ్రామాల వారీగా సమగ్ర ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో తాగునీటి అవసరాలు, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల స్థితి, విద్యుత్ వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ పనులపై ముందస్తు అంచనాలు రూపొందించాలని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలం వరకు జిల్లాలో ఎక్కడ కూడా ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మంచినీటి పైప్ లైన్ల మరమ్మతులు, నూతన నిర్మాణాలు, వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవడం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తూ, నీటి సరఫరా వ్యవస్థలు సక్రమంగా పని చేసేలా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయ కుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.